ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాలంటీర్లపై కర్ణాటకలో కేసు నమోదయింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాలంటీర్లపై తరచుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాలంటీర్లను కర్ణాటకలో అరెస్ట్ చేసారు. 

మద్యం మత్తులో కర్ణాటకలోని పావగడ తాలుకా వెంకటాపురం గ్రామానికి చెందిన రైతుపై దాడి చేసిన ఏపీకి చెందిన గ్రామ వాలంటీర్లను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకెళితే.. పెనుగొండ తాలూకు చెరుకూరుకు చెందిన వాలంటీర్లు.. తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం మరికొంతమంది మిత్రులతో కలిసి వెంకటాపురం వెళ్లారు. 

ఆ గ్రామంలో రవి అనే రైతు పొలంలో దావత్ ఏర్పాటు చేసుకున్నారు. తన పొలంలో ఇలా పార్టీ చేసుకోవడంపై సదరు రైతు రవి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో రెచ్చిపోయిన వాలంటీర్లు రాజు, సురేష్.. రైతు రవిపై దాడి చేశారు. 

ఇలా రైతుపై దాడి చేస్తుండడంతో గ్రామస్తులు వారిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న కర్ణాటక పోలీసులు.. ఇద్దరు వాలంటీర్లతో పాటు వారి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజుల కింద ఇలానే నరసరావుపేటలో వాలంటీర్ తన మిత్రులతో కలిసి తల్లీ, కొడుకులపై దాడి చేసాడు. శ్రీనివాస గిరిజన కాలనీలో తల్లీ, కొడుకులపై వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. అతని మాట వినలేదని వాలంటీర్‌ మల్లిఖార్జున తమపై దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు.

అతని దాడిలో ఉయ్యాల శివకృష్ణ, అతని తల్లి అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన వారిద్దరిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం శివకృష్ణ తన ఇంటి ముందు కంచె వేయడంతో వాలంటీర్ మల్లిఖార్జున అతనితో గొడవపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేయడంతో మల్లిఖార్జున ఆగ్రహంతో ఊగిపోయి మరోసారి శివకృష్ణపై దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 

ఇవే కాకుండా వాలంటీర్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పక్క రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.