రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించింది.  అమరావతి శిల్ప కళలోని ధమ్మ (ధర్మ) చక్రాన్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర చిహ్నాన్ని డిజైన్ చేసింది.

దీనిలో అందమైన ఆకుల మధ్య త్రిరత్నాలు ( బుద్ధుడు, ధర్మం, సంఘం), అత్యంత విలువైన రత్నాలు పొదిగించిన దండతో ధర్మచక్రాన్ని చిహ్నంలో ఏర్పాటు చేశారు. క్రీ.శ 1వ శతాబ్ధంలో ధాన్యకటకంలో చైత్యానికి విధుకుడు అనే వ్యక్తి బహుకరించిన పూర్ణఘటంను మూడు వృత్తాల్లో 48, 118, 148 ముత్యాలతో అలంకరించారు.

ధర్మచక్రం మధ్యలో నాలుగు పీటల దండల మధ్య ఈ పూర్ణఘటికను ఏర్పాటు చేశారు.. దీని కింది స్థానంలో భారత జాతీయ చిహ్నాం (నాలుగు సింహాలు) బొమ్మ ఉంటుంది. ఇప్పటి వరకు ఆంగ్లంలో ఉన్న ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’’ అన్న పదాన్ని తెలుగులో  చిహ్నంలోని పై భాగంలోనూ.. ఎడమ వైపున ఇంగ్లీష్‌లోనూ..కుడివైపున హిందీలోనూ ఏర్పాటు చేశారు..

దిగువన హిందీలో ఉండే ‘‘సత్యమేవ జయతే’’ అన్న పదాన్ని తెలుగులోకి మార్చారు. కొత్త అధికారిక చిహ్నాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ చిహ్నాన్ని ముఖ్యమంత్రి, కేబినెట్, సీఎస్, ప్రభుత్వ కార్యదర్శులు, అడ్వొకేట్ జనరల్, వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర సచివాలయంలోని మధ్య స్థాయి అధికారులు ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.