ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కన్నబాబు నియామకం దాదాపు ఖరారైంది. కార్యదర్శిగా రవిచంద్రను నియమించాలని ఎస్ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే అతన్ని కాకుండా ప్రభుత్వం విజయ్ కుమార్, కన్నబాబు, రాజబాబుల పేర్లను ప్రతిపాదించింది. దీంతో ఈ ముగ్గురిలో కన్నబాబును ఎస్ఈసీ ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

కన్నబాబు గతంలో పురపాలకశాఖ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా రవిచంద్రను నియమించాలని కోరుతూ అంతకు ముందు ఎస్ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఏపీ ప్రభుత్వం రవిచంద్రను కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో కన్నబాబును ఎంపిక చేసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా ఎస్ఈసీకి ప్రభుత్వానికి మధ్య మరో వివాదం చెలరేగింది. 

ఇప్పుడు తాజాగా ఎస్ఈసీ వర్సెస్ ఐఏఎస్ ల మధ్య ఆధిక్య పోరు నడుస్తోంది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే పొలిటికల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ పంపారు.