Asianet News TeluguAsianet News Telugu

కడపలో కథ మారింది!

గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉంటూ వస్తున్న అహ్మదుల్లా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో కడప కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఈయన పోటీ చేస్తే కడప పోరు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Andhrapradesh Elections 2024 : The story has changed in Kadapa - bsb
Author
First Published Jan 25, 2024, 4:10 PM IST

కడప.. ఇప్పుడు వైఏస్సార్ జిల్లా.. పేరు ఏదయినా ఆంధ్రప్రదేశ్కు ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ ఒక ఐకాన్ గా చెప్పవచ్చు. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలోనూ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వివేకానందరెడ్డి హత్య అనంతర పరిణామాల నేపథ్యంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వివేకా కుమార్తె సునీత.. తండ్రి హత్య కారకులపై న్యాయ పోరాటానికి దిగడం.. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అరెస్టులతో పాటు.. షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడం.. అది కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీసీసీ పగ్గాలు చేపట్టడం.. ఇవన్నీ ఏపీ రాజకీయాలతో పాటు.. కడపలోనూ వాడీవేడిగా మారాయి. కడపలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల పావులు కదపడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సొంత జిల్లాలో రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నారు. జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీలో ఇప్పుడు త్రిముఖ పోటీపై చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అంటూ తలపడే పరిస్థితి ఏర్పడ్డ తరుణంలో, తాజాగా మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అహ్మదుల్లా కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలిస్తోంది.

రాజ‌కీయాల‌ నుంచి రిటైర్‌మెంట్ దిశగా గ‌ల్లా జయదేవ్.. ఈ నెల 28న ఏం చెప్పబోతున్నారు..?

కాంగ్రెస్ పార్టీలో కడప నుంచి ఒకసారి మున్సిపల్ ఛైర్మన్ గా, ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో వైఎస్ హయాంలో రెండుసార్లు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అహ్మదుల్లా. మంత్రిగా కూడా పని చేశారు. దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన అహ్మదుల్లా.. ఆయనకు ఆప్తుడిగానూ మెలిగారు. ముందు నుంచే రాజకీయ కుటుంబానికి చెందిన వారుగా అహ్మదుల్లాకు పేరుంది. కడప నగరంలో ఆ కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు ఉంది. అయితే వైఎస్ మరణానంతరం దారితీసిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి దగ్గర అయినట్లు అనిపించినా అక్కడ క్రియాశీలకంగా కనిపించలేదు.

గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉంటూ వస్తున్న అహ్మదుల్లా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో కడప కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఈయన పోటీ చేస్తే కడప పోరు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదుల్లా పోటీపై వైసీపీ, టీడీపీల్లోనూ అలజడి నెలకొంది. సొంత జిల్లాపై షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టడం ఇక్కడ కీలకం అయింది. వైసీపీకి గత రెండు దఫాలుగా ఈ స్థానంలో ఎదురులేదు. టీడీపీకి బలమైన అభ్యర్థులు లేరు. కడప అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి గెలిచిన అంజాద్ భాషా ఇప్పుడు డిప్యూటీ సీఎంగానూ కొనసాగుతున్నారు. ఈయన జగన్ కు వీర విధేయుడు. అందుకే జగన్ అంజాద్తో పాటు.. కడప కార్పొరేషన్ చైర్మన్గా సురేష్ బాబును నియమించుకుని తన బలగాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కంచుకోటను బద్దలు కొట్టేందుకు షర్మిల పావులు కదుపుతోంది. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అహ్మదుల్లా బరిలోకి దిగితే వైసీపీకి సానుకూలమను కుంటున్న మైనార్టీ ఓట్లకు గండి కొడతారన్న అంచనాల ఒకవైపు ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లితే టీడీపీ ఓట్లకు గండి పడతాయన్న అంచనాలు మరో వైపు సాగుతున్నాయి. ఎవరికి వారుగా వైసీపీ, టీడీపీ నేతలు బలమైన వారుగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో... అహ్మదుల్లా ఎవరికి నష్టం చేకూర్చుతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇదే మాదిరి సొంత జిల్లాలో షర్మిల అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీలో దించితే ఆమెకు ప్రాధాన్యం లభిస్తుంది. వైసీపీకి కష్టంగానూ మారుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారన్నది రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న మాట. మొత్తంగా కడపలో కథ మారుతుండటం అందరిలోనూ ఆసక్తి, ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios