లండన్‌లో కొడుకు మరణం .. భార్య తట్టుకోలేదని దాచిపెట్టిన భర్త, ఇంతలో స్వగ్రామానికి మృతదేహం
లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధి ఆరాధ్యుల కిరణ్ మృతదేహం అతని స్వగ్రామం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు కిరణ్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధి ఆరాధ్యుల కిరణ్ మృతదేహం అతని స్వగ్రామం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చేరుకుంది. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడన్న కొడుకు .. విగత జీవిగా ఇంటికి చేరే సరికి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘‘లేవరా నాయనా’’ .. ‘‘లేవరా కిరణ్ ’’ అంటూ గుండెలవిసేలా రోదించారు. వారిని చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు.
ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు కిరణ్ కుమార్ చేబ్రోలు, గుంటూరు, ఏలూరులో చదువుకున్నాడు. విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో చేరి కొన్నాళ్లు పనిచేశాడు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం లండన్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. ఎంతో కష్టపడి ఎంఎస్ పూర్తి చేసిన కిరణ్.. తనకు త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందని కొద్దిరోజుల క్రితం తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అలా చెప్పే రోజులు గడవకముందే లండన్‌లో గత నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
అతని మరణవార్త తెలుసుకున్న తండ్రి యజ్ఞనారాయణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే ఈ విషయాన్ని భార్య భూలక్ష్మీకి చెప్పలేదు. నిప్పులాంటి నిజాన్ని గుండెల్లో దాచుకుని.. కిరణ్ మృతదేహం భారతదేశానికి వస్తుండటంతో భార్యకు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో భూలక్ష్మీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కిరణ్ భౌతికకాయాన్ని లండన్‌లోని ఎన్ఆర్ఐలు, తెలుగు సంఘాల సహకారంతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం గొడవర్రుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు కిరణ్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.