చండీఘడ్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయంలో  ఆంధ్ర విద్యార్థి ఒకతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవాడు. ఒంటరితనం భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో చెప్పాడు. 

విశ్వవిద్యాలయం హాస్టల్ భవనం ఏడో అంతస్థుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తాడిపత్రికి చెందిన భరత్ కుమార్ గా గుర్తించారు. అతని తండ్రి శ్రీనివాసులు నాపరాళ్ల వ్యాపారం చేస్తుంటాడు. శ్రీనివాసులు మూడో సంతానం భరత్. తనకు ప్రేమ వ్యవహారాలేమీ లేవని భరత్ తన సూసైడ్ నోట్ లో స్పష్టం చేశాడు. 

సూసైడ్ నోట్ ఇలా ఉంది...  ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా నావళ్ల ఇబ్బంది పడుంటే సారీ, దయచేసి హాస్టల్స్‌లో ఉన్నప్పుడు రూమ్‌లలో ఒంటరిగా ఉండకండి.రోజుకి కనీసం గంటైనా ఆడుకోవటానికి వెళ్లండి. రిలాక్స్‌ కావడానికి అదే మంచి మార్గం. లేకుంటే నాలాగే సూసైడ్‌ ఆలోచనలు వస్తాయి. 

సూసైడ్‌ చేసుకునే వారిని పిరికివాళ్లుగా తీసిపారేయకండి. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వందేళ్లు బతికినా రాదు. అంతకష్టం సూసైడ్‌ చేసుకోవడం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మా అమ్మానాన్నల గురించి చెప్పాలంటే, నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించే గొప్పవాళ్లు. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాళ్లు. పాపం వారెలా తట్టుకుంటారో నేను చనిపోయానని తెలిసి.

నా రియల్‌ లైఫ్‌లో జగదీష్‌ అంత దానకర్తని చూడలేదు. చిన్నప్పటినుంచి మా అన్నవాళ్లు కూడా సపోర్టు చేస్తూ వచ్చారు. ఇంక మీరే అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. ఇంక చెప్పడానికేం లేదు. నా ప్రాణస్నేహితులకు, మిత్రులకు, శత్రువులకు, బంధువులందరికీ నా జీవితంలో మీరూ భాగమైందుకు కృతజ్ఞతలు. నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేదు. గుడ్‌బై. వీలైతే మరణానంతరం నా అవయవాలు దానం చేయండి.