Andhra Pradesh News: కాంగ్రెస్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయమని వెల్లడించారు.
YCP-Congress Alliance: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తెరలేపాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కాంగ్రెస్-వైకాపాలు కలిసి బరిలోకి దిగనున్నాయా? అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దారుణ పరిస్థితితో ఉంది. అయితే, మళ్లీ గత వైభవంతో వెలుగొందాలనీ, దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ను పార్టీలో చేర్చుకోవడంతో పాటు.. ఎన్నికల్లో ముందుకు సాగే ప్రాణాళికలు రచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పలుమార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నిల్లో విజయం సాధించడానికి ఆయన భారీ ప్లాన్ ఇచ్చారని సమాచారం. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల నుంచి కలిపి పోటీ చేయాలని సూచించారట. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు.
అయితే, కాంగ్రెస్ తో పొత్తుకు వైసీపీ ఒకే చెబుతుందా? లేదా? అనే చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదు అనే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తమ పార్టీ నాయకులు భిన్న అభిప్రయాలు వ్యక్తం చేసినా సరే.. తుది నిర్ణయం సీఎం జగన్మోహన్ రెడ్డిదే నని స్పష్టం చేశారు. శనివారం నాడు మంత్రి గుంటూరు పట్టణంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ భవన్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ అంబేద్కర్ భవన్ కి మరిన్ని నిధులు మంజూరు చేసీ పూర్తి చేస్తామని తెలిపారు. అంబేడ్కర్ జయంతి నాటికి విజయవాడ లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం.. రాజ్యాంగ నిర్మత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఆశయ సాధాన లక్ష్యంతో పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ తో వైకాపా పొత్తు గురించి ఇదివరకే పలువురు అధికార పార్టీ నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైకాపా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల పొత్తుల వ్యవహారంపై తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయమన్నారు. పొత్తుల విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే స్పందిస్తారని పేర్కొన్నారు. ఈ పొత్తు విషయం అనేక అంశాలతో ముడిపడి ఉందని తెలిపారు. అలాగే, పొత్తుపై ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంలాటి పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ ను ఎదిరించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనం నవ్వుకుంటారని చెప్పారు.
