ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాల్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఏప్రిల్ 21 , 22 తేదీలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అకాశం ఉందని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆగ్నేయ / నైరుతి గాలులు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏసీఎస్‌డీఎంఏ) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక మండలంలో తీవ్రమైన వేడిగాలులు, మరో 98 మండలాల్లో వేడిగాలుల కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7 మండలాలు, అనకాపల్లిలో 16, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, విశాఖపట్నంలో రెండు చొప్పున మండలాల్లో, గుంటూరులో మూడు మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే కాకినాడ, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 10 చొప్పున మండలాల్లో, ఎన్టీఆర్‌ జిల్లాలో 8, పల్నాడు జిల్లాలో ఒకటి, పార్వతీపురం మన్యం జిల్లాలో 12, శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 19 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

బుధవారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 44.7 డిగ్రీల సెల్సియస్‌, నెల్లిపాకలో 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేసింది.