ప్లాస్మా దాతలకు రూ. 5 వేలు ఇవ్వాలి: జగన్ ఆదేశం
ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్.జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.
అమరావతి:ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్.జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.
ప్లాస్మా థెరఫీపై కూడా బాగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ప్లాస్మా థెరపీ వల్ల మంచి ఫలితాలు ఉంటే ఈ విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన అధికారులకు సూచించారు.
ప్రతిజిల్లాలో కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.
ప్రతి ఆస్పత్రిలో కూడా బ్లాక్ బోర్డు పెట్టి ఆ ఆస్పత్రిలో బెడ్లు భర్తీ, ఖాళీల వివరాలను అందులో రాయాలన్నారు.
ఎవరికైనా బెడ్ అందుబాటులోకి లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్ అలాట్ అక్కడనుంచే జరిగేలా ఏర్పాటు ఉండాలని ఆయన అధికారులను కోరారు.
బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదని ఆయన అధికారులను కోరారు.హెల్ప్ డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలన్నారు.
కోవిడ్‌కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు.హెల్ప్ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్ బాగుండాలన్నారు.
హెల్ప్ డెస్క్ ప్రభావవంతంగా పనిచేస్తే... చాలావరకు సమస్యలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. జీజీహెచ్ సహా ఈ తరహా ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలన్నారు.
ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టిపెట్టండి. కాల్‌సెంటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? చూడండి. వచ్చే కొన్నిరోజులు దీనిపై శ్రద్ధ వహించాలని సీఎం కోరారు. స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలని సీఎం అధికారులను ఆదేశించారు.లేదంటే ప్రజలు వీటిని నిజం అనుకునే అవకాశాలు ఉంటాయన్నారు.
అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలన్నారు.
దీనికోసం వెంటనే మాస్కులు సిద్ధంచేయాలని కోరారు. మాస్కులు ఎలా వాడాలన్నదానిపై వారికి అవగాహన కూడా కల్పించాల్సిందిగా కోరారు.మూడేళ్లలో కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణం పూర్తికావాలని సీఎం కోరారు.