కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ సర్కార్ వేగం పెంచింది. దీనిలో భాగంగా కొత్త జిల్లాల ప్రక్రియపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల నేతృత్వంలోనూ సమావేశాలు జరుగుతుండగా.. ఇప్పటికే డీజీజీ సైతం సమావేశం నిర్వహించారు.

భౌగోళిక, ఆర్ధిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఆదాయ వనరులతో కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది సర్కార్.

అందుబాటులో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన చోట్ల అందుబాటులో వున్న ఉద్యోగులనే అప్‌గ్రేడ్ చేసి బాధ్యతలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్‌ వ్యవస్థీకరించాల్సి వస్తోందని భావిస్తున్నారు. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.

26 జిల్లాలకే పరిమితం కావడం కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ తరహాలోనూ జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.