ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పీఆర్సీ వివాదం కొలిక్కి వచ్చిందని భావించిన ప్రభుత్వ పెద్దలకు మరోసారి చిక్కులు తప్పకపోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. టీచర్ల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు (Teachers Unions) మండిపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పీఆర్సీ వివాదం కొలిక్కి వచ్చిందని భావించిన ప్రభుత్వ పెద్దలకు మరోసారి చిక్కులు తప్పకపోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. తాము తలపెట్టిన సమ్మెను విరమించినట్టుగా మంత్రుల కమిటీతో చర్చల అనంతరం పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రకటించారు. అయితే స్టీరింగ్ కమిటీ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకున్నాయి. టీచర్ల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు (Teachers Unions) ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ జీవోల వల్ల ఉపాధ్యాయలకు న్యాయం జరగలేదని ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలకు పిలపునిచ్చాయి.
ఈ క్రమంలోనే పలుచోట్ల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగానే ఫిట్‌మెంట్ ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు సమ్మె విరమణకు ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫిట్‌మెంట్ అంశాన్ని పక్కనబెట్టి, హెచ్‌ఆర్‌ఏపై చర్చలు జరిపి.. గ్రామీణప్రాంత ఉపాధ్యాయులను విస్మరించారని ఆరోపించారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించడం బాధకరమని అన్నారు. వారం రోజులుగా నల్లబాడ్జీలతో నిరసన తెలుపుతామని అన్నారు.
ఇక, నిరసనల్లో భాగంగా ఉపాధ్యాయులు సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నట్టుగా ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం తీరుపై ఆందోళనలకు ఫ్యాప్టో కమిటీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. 11వ పీఆర్సీ జీవోలను రద్దు చేసి, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల్లో ఉపాధ్యాయులకు, సీపీఎస్ సమస్యలు,కాంట్రాక్టు, ఔటసోర్స్, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటానికి పిలుపు నిచ్చారు. శుక్రవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్టుగా ఫ్యాప్టో ప్రతినిధులు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టుగా చెప్పారు.
