ఉపాధి కల్పనలో నెంబర్1 స్థానంలో ఏపీ
ఉపాధి హామీ పథకం కింద అత్యధిక మందికి లబ్ది చేకూర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని పంచాయితి రాజ్ శాఖా కమీషనర్ గిరిజ శంకర్ అన్నారు.
కరోనా కష్టకాలంలో బయట ఎక్కడా పనులు దొరక్కపోవడంతో.... ఊర్లలో ఉపాధి హామీ పనులే దిక్కయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద అత్యధిక మందికి లబ్ది చేకూర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని పంచాయితి రాజ్ శాఖా కమీషనర్ గిరిజ శంకర్ అన్నారు.
ఈ కరోనా కష్టకాలంలో 57 లక్షలమందికి పనులు కల్పించగలిగామని, 4వేల కోట్ల రూపాయలను వేతనాలకింద చెల్లించామని ఆయన తెలిపారు. ఒక్క జూన్ నెలలోనే అత్యధికంగా 8కోట్ల మం వర్క్ డేస్ కల్పించామని అన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, నాడు – నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు గిరిజ శంకర్.
ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నానాటికీ విజృంభిస్తోంది. ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. ఏపీ స్థానికుల్లో 1919 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీంతో గత 24 గంటల్లో మొత్తం 1935 కేసులు రికార్డయ్యాయి.
గత 24 గంటల్లో ఏపీలో 36 మంది కోవిడ్ -19తో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురేసి మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి మరణించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 365కి చేరుకుంది.
గత 24 గంటల్లో 19,247 శాంపిల్స్ ను పరీక్షించగా 1,919 మందికి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 1030 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 11,73,096 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 14,274 మంది ఆస్పత్రుల్లో కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.