అమరావతి: వాణిజ్య పన్నుల వసూళ్లలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దక్షిణాదిన మొదటి స్థానం, దేశంలో రెండోస్థానంలో నిలిచిందని ఉపముఖ్యమంత్రి, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి నారాయణస్వామి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు జీఎస్టీ ఆదాయం రూ.345.24 కోట్లు పెరిగిందని తెలిపారు. అయితే లిక్కర్‌ మీద వచ్చే వ్యాట్‌ గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. దీంతో మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరుతో పోలిస్తే ఈ ఏడాది రూ.3,843 కోట్లు తగ్గిందన్నారు.

మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్యకాలంలో రూ.28,670 కోట్లు వచ్చిందన్నారు. సీఎం జగన్‌ ఆదేశం మేరకు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌తో గత మూడు నెలల్లో రూ.1,073 కోట్ల బకాయిలు వసూలయ్యాయన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో చక్కటి పనితీరు కనబరిచిన వివిధ స్థాయిల్లోని 257 మంది అధికారులకు శాఖాపరంగా ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలు ఇస్తున్నామని మంత్రి నారాయణస్వామి తెలిపారు.

వాణిజ్య శాఖ సొంత కార్యాలయాలు నిర్మించుకోవడానికి జిల్లాల వారీగా స్థలాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న కామన్‌ డేటా సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.