ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతుంది. ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న తరుణంలో వారి అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. నిన్న PRC Steering Committee నాయకులతో సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు సాగాయి. నేడు మరోసారి పీఆర్సీ సాధన సమితి నాయకులతో మంత్రులు కమిటీ భేటీ కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతుంది. ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న తరుణంలో వారి అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు సమ్మెకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తొలుత డీజీపీతో సమావేశమయ్యారు. చలో విజయవాడపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం. అనంతరం ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ఏర్పాటైన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో కూడిన కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి.. కొన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడాలని సీఎం జగన్ మంత్రుల కమిటీని ఆదేశించారు.

అనంతరం మంత్రుల కమిటీ నుంచి పీఆర్‌సీ సాధన సమితి (PRC Steering Committee) నాయకులకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పీఆర్సీ, ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు.. తదితర అంశాలపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కొన్నింటిపై స్పష్టమైన హామీ లభించగా.. మరికొన్నింటిపై అస్పష్టత నెలకొంది. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ లభించింది. ఇదిలా ఉంటే.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దుపై మాత్రం ఎలాంటి హామీ లభించలేదు.

నేడు మరోసారి భేటీ..
ఈ క్రమంలోనే నేడు మరోసారి మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు సమావేశం కానున్నారు. శనివారం ఉదయం మంత్రుల కమిటీ, ఆర్థిక శాఖ అధికారులు భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి నాయకులతో సమావేశం కానుంది. సరమైతే ఆ సమావేశం అనంతరం.... ముఖ్యమంత్రి జగన్‌తోనూ ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఈ బేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చర్చల ద్వారా వారి అసంతృప్తి చాలా వరకు తొలగిపోయిందన్నారు. శనివారం మళ్లీ ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నట్టుగా చెప్పారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నేడు ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరిపి అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉద్యోగులతో మళ్ళీ కలిసి పని చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. పీఆర్సీని 5 ఏళ్లకు తగ్గించే అంశాన్ని అంగీకారాన్ని తెలిపామని.. ఐఆర్ రికవరీ చేయకూడదనే ప్రతిపాదనకు అంగీకరించినట్టుగా వెల్లండించారు. 

పీఆర్సీకి సంబంధించిన అంశాలపై పూర్తి స్ధాయిలో మంత్రుల కమిటీతో చర్చించామని సమావేశం అనంతరం పీఆర్సీ సాధన సమితి నాయకులు తెలిపారు. చాలా అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. చర్చలు కొనసాగుతున్నందున శనివారం తాము ముందుగా ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలు సానుకూలంగానే జరిగాయని.. అయితే కొన్ని అంశాల్లో ఆర్ధిక శాఖ అధికారులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. సామాన్య ఉద్యోగికి అన్యాయం జరగకుండా కమిటీతో చర్చలు జరిపినట్టుగా వెల్లండించారు.