ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట ఆరు గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక, మున్సిపల్ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.
రాత్రి, పగలు తేగా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు.. ఎండ తీవ్రత.. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు వేసవిలో సమయం సందర్భం లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళ గంటల తరబడి కరెంటు కట్ చేయడంతో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్ లేని విద్యుత్ కోతల కారణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో కూడా ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు కూడా కరెంట్ కోతలతో.. పసిపిల్లల తల్లులు విసనకర్రలతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది.
విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కూడా కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కరెంట్ కోతల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఇలా విద్యుత్ కోతలు విధిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజలు.. విద్యుత్ సబ్ స్టేషన్‌ల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు విద్యుత్ కోతలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తున్నాయి. కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్న కొందరు.. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కోతలు విధించే షెడ్యూల్ ప్రకటించాలని అడుగుతున్నారు.
ఆస్పత్రుల్లో కరెంట్ లేక రోగుల ఇబ్బందులు..
జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రిలో రాత్రి మొత్తం విద్యుత్ సరఫరాల నిలిచిపోయింది. దీంతో చంటి బిడ్డలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. ప్రసూతి వార్డులో కరెంట్ లేకపోవడంపై బాలింతల బంధువులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే జనరేటర్ నడిపేందుకు డీజిల్ లేదని వారు చెప్పారు. మరోవైపు చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇక, విద్యుత్ కోతల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయ పంపుసెట్లకు తొమ్మిది గంటల నిరంతర సరఫరా అందడం లేదు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు.
సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం.. అధిక పగటి ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రైతుల కూడా పంటలను కాపాడుకునే ప్రయత్నంలో.. మోటార్ పంపుసెట్లను ఉపయోగిస్తున్నారు. మరోవైపు షాపింగ్ మాల్స్, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ఆసుపత్రులు కూడా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది.
