ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం మరికాసేపట్లో కొలువు తీరనుంది. ఉదయం 11.31 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం మరికాసేపట్లో కొలువు తీరనుంది. ఉదయం 11.31 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకు పక్కన ఈ కార్యక్రమం జరగనుంది. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతారు. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగుతారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి 5 వేల మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పాస్‌ల పంపిణీ కూడా జరిగింది. 

ఇక, గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మైనారిటీ కోటా నుంచి అంజాద్ బాషా మరోమారు డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గం నుంచి నారాయణ స్వామి లేదా పినేపి విశ్వరూప్ లేదా తానేటి వనితకు డిప్యూటీ సీఎంగా చాన్స్ దక్కే సూచనలు ఉన్నాయి. బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్స సత్యనారాయణకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాపు వర్గం నుంచి దాడిశెట్టి రాజా లేదా అంబటి రాంబాబులకు డిప్యూటీ సీఎంగా చాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. 

మంత్రుల శాఖల విషయానికి వస్తే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో తీసుకున్న పాత మంత్రుల్లో కొందరికి గతంలో నిర్వహించిన శాఖలే కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ శాఖతో పాటుగా మరో కీలక శాఖను అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతుంది. 

తొలి మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా చెప్పినట్టుగానే సీఎం జగన్.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7వ తేదీన ప్రస్తుతం ఉన్న 24 మంత్రులతో రాజీనామా చేయించారు. అయితే అనుహ్యంగా కొత్త మంత్రివర్గంలో 11 మంది పాత వారికి మరోమారు అవకాశం కల్పించారు. కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోమారు సీఎం జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పించారు. 


కొత్తగా.. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌‌కు మంత్రి పదవులు ఇచ్చారు.