ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌తో (YS Jagan) ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల కమిటీ భేటీ అయింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరించనుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌తో (YS Jagan) ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల కమిటీ భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరించనుంది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పీఆర్సీ సాధన సమితి నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది. 

ఇక, శనివారం ఉదయం మంత్రి పేర్ని నాని (Perni Nani) మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు నుంచి ఉద్యోగులకు మేలు చేయాలనే చెబుతున్నారని తెలిపారు. అందుకే మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు. నిన్న రాత్రి ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఉద్యోగులకు నష్టం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించదని చెప్పారు. హెఆర్‌ఏ సహా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. 

ఈరోజు జరిగే చర్చలు ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నట్టుగా మంత్రి పేర్ని నాని చెప్పారు. చర్చల తర్వాత ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. నిన్నటి చర్చల్లో అనేక అంశాలపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అవుతామని వెల్లడించారు. షరతులతో చర్చలు జరగవని.. సమస్య పరిష్కారం కాదని అన్నారు. 

ఇక, నిన్న ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పీఆర్సీ, ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు.. తదితర అంశాలపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కొన్నింటిపై స్పష్టమైన హామీ లభించగా.. మరికొన్నింటిపై అస్పష్టత నెలకొంది. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ లభించింది. ఇదిలా ఉంటే.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దుపై మాత్రం ఎలాంటి హామీ లభించలేదు.