నారా లోకేష్ షాక్‌తో బిత్తరపోయిన టీజీ వెంకటేష్

Andhra Pradesh IT Minister Nara Lokesh renominates Kurnool MP, MLA for polls
Highlights

కర్నూల్ జిల్లా పర్యటనలో ఎంపీ టీజీ వెంకటేష్ కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. 


కర్నూల్: కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్  ఎంపీ టీజీ వెంకటేష్‌కు షాకిచ్చారు. 2019 ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని  ప్రకటించారు. దీంతో టీజీ వెంకటేష్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్  ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.  2014 ఎన్నికల సమయంలో టీజీ వెంకటేష్ టీడీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో ఆయన  టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.  ఆ సమయంలో వైసీపీ అభ్యర్ధిగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేశారు.  అయితే ఎస్వీ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. 

ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు.  దీంతో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

2019 ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానంనుండి తనయుడిని  టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ భావిస్తున్నారు.  ఈ మేరకు  పావులు కదుపుతున్నారు. టీజీ భరత్  కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు  రంగం సిద్దం చేసుకొంటున్నారు.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారని  నారా లోకేష్ సోమవారం నాడు కర్నూల్ లో ప్రకటించారు. కర్నూల్ ఎంపీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా బుట్టా రేణుక బరిలోకి దిగుతారని ఆయన ప్రకటించారు. 

అయితే నారాలోకేష్ చేసిన ప్రకటన  టీజీ వెంకటేష్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది.  ఈ ప్రకటన చేసిన వెంటనే టీజీ వెంకటేష్  వేదికపై తాను కూర్చొన్న సీటు నుండి మరో సీటులోకి మారిపోయారు.  

వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం టీజీ కుటుంబం, ఎస్వీమోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో లోకేష్ ఎస్వీ మోహన్ రెడ్డి పేరును ప్రకటించడం  రాజకీయంగా టీజీ వెంకటేష్ వర్గానికి  నష్టం కల్గించేదిగా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి పాలైనందున పార్టీ అవసరాల రీత్యా  టీజీ వెంకటేష్‌కు  రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు.  ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  ఎస్వీ మోహాన్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుండి టీజీ  కుటుంబానికి, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది.

నారా లోకేష్ ప్రకటనతో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్వీ మోహన్ రెడ్డి పై చేయి సాదించినట్టుగా రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే  ఈ పరిణామాల నేపథ్యంలో  టీజీ వెంకటేష్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్తారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

loader