ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita).. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుంటూరు జిల్లా పర్యటనకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita).. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుంటూరు జిల్లా పర్యటనకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ విధేయురాలిగా పేరుంది. అందుకే అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలను సీఎం జగన్.. సుచరితకు అప్పగించారు. గతంలో సీఎం జగన్.. గుంటూరు జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో సుచరిత కనిపించారు. అయితే నేటి సీఎం జగన్ పర్యటనలో మాత్రం కనిపించలేదు. దీంతో ఆమె ఎందుకు రాలేకపోయారనే పలువురు ఆరా తీశారు. 

అయితే సుచరిత.. సీఎం జగన్ పర్యటనకు హాజరుకాకపోవడానికి శిలాఫలకం మీదే ఆమె పేరు లేకపోవడమేనని తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరులో అక్ష‌య‌పాత్ర సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ప్రారంభం, అలాగే తాడేప‌ల్లి మండ‌లంలోని కొల‌నుకొండ‌లో హ‌రేకృష్ణ గోకుల క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. అయితే ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై మీద జిల్లాకు చెందిన మంత్రి సుచరితతో పాటు, మరికొందరి పేర్లు ముద్రించలేదు. 

ఈ కారణంతోనే సుచరిత.. సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఆమె సీఎం జగన్ పర్యటనలో పాల్గొనాలని భావించినప్పటికీ.. కానీ శిలాఫలకం మీద పేరు లేకపోవడంతో అక్కడి వెళ్లకూడదని ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ ప్రొటోకాల్ పాటిస్తుంటారు. అయితే ఇస్కాన్ సంస్థ తరఫున కార్యక్రమ నిర్వహణ చూసిన వారు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సుచరిత పేరును మరిచారు. 

ఇక, మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను (Akshaya Patra centralized kitchen) సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. స్కూళ్లలో జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది. కేవలం రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్దం చేసేలా దీన్ని నిర్మించారు. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న భోజనవివరాలను..ఫౌండేషన్‌ ప్రతినిధులు సీఎంకు వివరించారు

ఇదిలా ఉంటే.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. ఇక్కడ రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్‌పో, సంకస్కార హాల్ నిర్మించనున్నారు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి.