అమరావతి:ఇంటర్మీడియట్ ఆడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వానికి సోమవారం నాడు హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటర్మీడియట్ లో ఆన్ లైన్ ఆడ్మిషన్లు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది.  ఈ అంశంలో ఏ నిబంధనల ప్రకారం ముందుకెళ్తున్నారని విద్యాశాఖను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.  

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశముందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

 అడ్మిషన్ల సమయంలో విద్యార్థికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఏ గ్రూపులో ఆసక్తి ఉందో తెలుసుకుని సీటు కేటాయిస్తారని.. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడనే అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపారు. 

 దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.  దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ అప్పటి వరకు స్టే విధించింది. ఈలోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభుత్వమే కాలేజీలో సీట్లు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యార్ధులు ఏ కాలేజీలో చేరాలనే దానిపై వారి ఇష్టానికి వదిలేయాలని పిటిషనర్లు కోరారు.

ప్రభుత్వమే కాలేజీలను ఎలా కేటాయిస్తుందని పిటిషనర్లు వాదించారు. దీంతో 10 రోజుల పాటు జీవోను సస్పెండ్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 10వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.