అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీకి సహకరించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై  బుధవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ విషయమై తమ అభిప్రాయం చెప్పాలని గతంలోనే హైకోర్టు నోటీసులు పంపడంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

also read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపకూడదు: ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసు

ఎన్నికల నిర్వహణకు అవసరమైన రూ. 40 లక్షలకు గాను తాము రూ. 39 లక్షలను విడుదల చేసినట్టుగా ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.ప్రతి దానికి ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా అని హైకోర్టు ప్రశ్నించింది.

ఏ విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది హైకోర్టు.ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.