అమరావతి:  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపకూడదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.పంచాయితీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది.

కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  ఇదే విషయాన్ని ఏపీ ఎన్నికల కమిషనర్ చెప్పాలని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ కేసు విచారణ సమయంలో ఏపీ ఎన్నికల సంఘం తరపున ఎవరూ కూడ హాజరు కాకపోవడంతో ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కరోనా ఉన్నప్పటికీ కూడ ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో పంచాయితీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

కరోనా నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ ఈ ఏడాది మార్చి 15వ తేదీన నిర్ణయం తీసుకొంది.అయితే అప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల విషయంలో ఇబ్బందులు లేవని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేయడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై  ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.