కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితమే దేశంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.

దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబులు రెచ్చిపోయారు. అయితే.. ఇప్పటికే దేశంలో విధించిన మందు ధరలను మించి అదనంగా 50శాతం ధర పెంచారు. అయినా కూడా మందుబాబులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గించింది. ఏపీలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు గ‌వ‌ర్న‌మెంట్ ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని 3500కు గతంలోనే తగ్గించారు. ఇప్పుడు వాటిని 2934కు తగ్గిస్తూ స‌ర్కార్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. 

స్టేట్ లో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చేదిశగా ముందుకు వెళ్తున్న ప్ర‌భుత్వం, అందులో భాగంగా ఇప్పుడు మద్యం దుకాణాలను తగ్గించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటన జారీ చేసింది. ఏ జిల్లాల్లో ఎన్ని దుకాణాలను తగ్గించారనే వివరాలను ప్రభుత్వం త్వరలో తెలియజేయనుంది.

ఇక మందుబాబులు షాపుల తెర‌వ‌డంతో గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం రావ‌డంతో అధికారులు అల‌ర్ట‌య్యారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధ‌న‌ను తెర‌పైకి తెచ్చారు.మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడగు తప్పనిసరి ఉండాలని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది కాబట్టి ఈ ర‌కం నిబంధన అమలు చేశారు.