అమరావతి:  రాష్ట్రం గుండా వెళ్తున్న వలసకూలీలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం నాడు వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వలస కార్మికుల సమస్యలపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్ అధికారులతో చర్చించారు.

వలస కార్మికులకు ఇప్పటివరకు ఏపీ రాష్ట్రం అందించిన సహాయానికి సంబంధించిన సమాచారాన్ని సీఎం జగన్ కు అధికారులు అందించారు. కాలినడకన ఒడిశాకు వెళ్తున్న 902 మంది వలస కార్మికులను షెల్టర్లలో ఉంచి భోజన, వసతిని కల్పించామన్నారు. వీరిని స్వంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ప్రకాశం జిల్లా నుండి 10 బస్సుల్లో 470 మంది, కృష్ణా జిల్లా నుండి 16 బస్సుల్లో 410 మందిని శ్రీకాకుళం నుండి 1 బస్సులో 22 మంది వలస కార్మికులను స్వంత రాష్ట్రాలకు పంపామన్నారు. 

also read:ఏపీపై కరోనా పంజా: 24 గంటల్లో 25 కేసులు, మొత్తం 2330కి చేరిక

ఇవాళ గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లానుంచి 52 మంది వలసకూలీలను పంపిస్తున్నామన్న అధికారులు సీఎం జగన్ కు వివరించారు.వలస కార్మికులు నడుచుకొంటూ వెళ్లాల్సిన అవసరం లేదని నచ్చచెప్పినా కూడ వారు కొందరు వినని పరిస్థితులు కూడ ఉన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

ఏ రాష్ట్రంలో కూడ చేయని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని అధికారులు వివరించారు. భోజనంతో పాటు ఇతరత్రా సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.వలస కార్మికులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఖర్చు గురించి వెనుకాడకూడదని సీఎం అధికారులను కోరారు.