Machilipatnam: ఉగాది రోజున 16 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్న అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6 వేల ఇళ్లు లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ అయ్యాయ‌ని కృష్ణా జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని టిడ్కో టౌన్ షిప్ ఎమ్మెల్యే కొడాలి నానితో క‌లిసి సంద‌ర్శించారు.  

Krishna District-TIDCO houses: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 16 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా వెల్లడించారు. మల్లాయిగూడెం (గుడివాడ) టిడ్కో టౌన్ షిప్ లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని)తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ టౌన్ షిప్ లో ఇళ్ల నిర్మాణం, సౌకర్యాల పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని పేర్కొన్నారు.

తాగునీరు, సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రెయిన్లు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల పనులు ఇప్పటివరకు 90 శాతం పూర్తయ్యాయనీ, మిగిలిన పనులను 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 7,326 మంది లబ్ధిదారులకు గాను 5,684 మంది లబ్ధిదారులకు రూ.157.85 కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 6 వేల ఇళ్లను లబ్ధిదారుల పేరిట నమోదు చేశామనీ, మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు.

గుడివాడ అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింద‌ని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.40 కోట్ల అంచనా వ్యయంతో భూసేకరణ ప్రారంభించామన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే వెంట టిడ్కో పీవో బి.చిన్నోడు, ఏపీ టిడ్కో డైరెక్టర్ పి.రాఘవరావు, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు తదితరులు ఉన్నారు.

విజ‌య‌న‌గ‌రంలోనూ పెండింగ్ పనులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించి ఏపీ టిడ్కో కింద నిర్మించిన ఇళ్లను ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేయాలని యోచిస్తోంది. మొదటి విడతలో ఇప్పటికే 800 ఇళ్లను అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందనీ, మార్చిలో సామూహిక గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించాలని యోచిస్తున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. జిల్లాలోని సరిపల్లి, సోనియానగర్, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలిలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వీటన్నింటినీ మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గ‌త నెల‌లో టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్ సరిపల్లి, సోనియానగర్ లోని గృహనిర్మాణ ప్రాజెక్టులను సందర్శించి పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.