Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయ అడ్వయిజరీ బోర్డుల ఏర్పాటు ... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రైతులతో పాటు కౌలుదారులకూ పంట రుణాలు అందించాలనే సదుద్దేశ్యంతో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకూ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 

Andhra Pradesh government to set up agricultural advisory boards
Author
Amaravathi, First Published Jul 15, 2020, 9:14 PM IST

అమరావతి : రైతులతో పాటు కౌలుదారులకూ పంట రుణాలు అందించాలనే సదుద్దేశ్యంతో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకూ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ పక్షోత్సవాల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. 

సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రైతులతో పాటు కౌలుదాలకూ మేలు కలుగజేయాలనే ఉద్దేశ్యంతోనే నూతన సాగుదారుల చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలుగదని ఆయన భరోసా ఇచ్చారు. 

11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించామన్నారు. కౌలు దారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బ్యాంకు, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో పంట రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని కోరామని చంద్రబోష్ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలు అందజేస్తోందని కానీ ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని మంత్రి చంద్రబోస్ పేర్కొన్నారు.  

read more భారీ ఉద్యోగాల భర్తీ, కేసుల ఉపసంహరణలు... ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

మరో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ... రైతులతో పాటు కౌలుదారులకూ పంట రుణాలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు, కౌలుదారులకు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీసీఆర్సీ కార్డులు అందుకున్నవారందరికీ పంట రుణాలు అందిస్తామన్నారు. 

రాష్ట్రంలో నేటి వరకూ  4,02,229 పంట సాగుదారుల హక్కు పత్రాలు( సీసీఆర్సీ కార్డులు) అందజేశామన్నారు. మరో లక్షన్నర వరకూ కార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. రైతులకు అందజేసే పథకాలన్నీ కౌలుదారులకూ లబ్ధి కలుగజేయాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కన్నబాబు తెలిపారు. దీనిలో భాగంగానే రూ.8,500 కోట్ల పంట రుణాలు కౌలుదారులకూ అందజేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు. 

Andhra Pradesh government to set up agricultural advisory boards

ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే పక్షోత్సవాల్లో వ్యవసాయాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా పాల్గొననున్నారన్నారు. ఈ పక్షోత్సవాల్లో కిసాన్ క్రిడెట్ కార్డులపై అవగాహన కల్పిస్తామన్నారు. 

జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో వ్యవసాయ అడ్వయిజరీ బోర్డులు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ అడ్వయిజరీ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. 

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.200 కోట్ల ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కొద్దిరోజుల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. 

రూ.1,150 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను ఇటీవలే విడుదల చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇదే విషయమై బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారన్నారు. ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 

రాష్ట్రంలో వర్షపాతం సాధాకరణం కంటే అధికంగా ఉండడంతో ఖరీఫ్ పనులు ఆశాజనకంగా ఉన్నాయని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే 51.5 శాతం అధికంగా వర్షం కురిసిందన్నారు. దీంతో ఇప్పటికే 32 శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశామన్నారు. 

ఇప్పటికే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు ముంపునకు గురయ్యాయని, వాటి వివరాలు అందజేయాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించామని తెలిపారు. వివరాలు రాగానే సంబంధిత రైతులను ఆదుకుంటామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios