అమరావతి: అమరావతి ప్రాంత రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

వార్షిక కౌలు కింద రూ. 158 కోట్లతో పాటు రెండు మాసాల పెన్షన్ కింద రూ. 9.73 కోట్లను లబ్దిదారుల రైతుల ఖాతాల్లోకి జమచేయనుంది ప్రభుత్వం.ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేశారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన రైతుల నుండి భూములను సేకరించారు. అయితే టీడీపీ ప్రభుత్వం కంటే తాము అధికంగా పరిహార భృతిని ఇస్తామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు పెన్షన్ ను రూ. 2500 నుండి రూ. 5 వేలకు పెంచారు.  

పెన్షన్ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ. 5.2 కోట్ల భారం పడనుంది. ఏడాదికి రూ. 60.30 కోట్ల భారం పడే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం కోసం భూముల ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలు ఇస్తామని చంద్రబాబునాయుడు ప్రభుత్వం  సీఆర్డీఏ చట్టంలో పొందుపర్చారు. 

కౌలు డబ్బులను చెల్లించాలని కోరుతూ అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఈ నెల 26వ తేదీన నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే.