అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు. ఇవాళ సాయంత్రం నుండి రేపు ఉదయం లోపుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ కానున్నాయి.

గత మాసంలో జరిగిన శాసనమండలి సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే శాసనమండలి వాయిదా పడింది. సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై చర్చించాలని వైసీపీ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని టీడీపీ కోరింది. ఈ విషయమై ఇరువర్గాలకు చెందిన సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో శాసనమండలి నిరవధికంగా  వాయిదా పడింది.

also read:ఉద్యోగులకు జీతాలు నిలిచిపోవడానికి టీడీపీయే కారణం: తమ్మినేని సీతారాం

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే శాసనమండలి వాయిదా పడడంతో ఒక్క పైసా కూడ ఖర్చు చేయలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నెలకొంది. 
దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలతో పాటు పెన్షనర్లకు పెన్షన్ ప్రభుత్వం చెల్లించలేదు. 

దీంతో ఈ నెల 2వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ద్రవ్య వినిమయ బిల్లుకు  ఆమోద ముద్ర వేశారు. దీంతో ఉద్యోగుల జీతాలతో పాటు ఇతర ఆర్ధిక బిల్లుల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి.ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించినా... శాసనమండలిలో ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

జూలై 1వ తేదీ వరకు ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం డబ్బులను ఖర్చు చేసింది. మూడు మాసాలకే ఆర్డినెన్స్ గడువు ముగిసింది. దీంతో గవర్నర్ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నెల 2వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక చెల్లింపులకు అడ్డంకులు తొలగిపోయాయి. జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం నుండి రేపు ఉదయం నాటికి ఉద్యోగులకు జీతాలు అందనున్నాయి.