తిరుపతి: శాసనమండలిలో ఆర్ధిక బిల్లును టీడీపీ అడ్డుకోవడంతోనే ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని ఏపీఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.  

గురువారం నాడు ఆయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారికి పెన్షన్లు సైతం ఆగిపోయినట్టుగా ఆయన చెప్పారు. ఆర్ధిక బిల్లును అడ్డుకోవడంతోనే టీడీపీకి ప్రజలపై ఉన్న ప్రేమ ఏమిటో అర్ధం అవుతోందన్నారు. 

ప్రపంచంలో ఎక్కడా కూడ ఆర్ధిక బిల్లును అడ్డుకొన్న చరిత్ర లేదని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రజల సంక్షేమం కోసం విపక్షాలు నిర్ణయాత్మకపాత్రను పోషించాలని ఆయన సూచించారు. 

108, 104 అంబులెన్స్ ల విషయంలో టీడీపీ విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో వైఎస్ఆర్ కంటే జగన్ చాలా ముందున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని ఆయన కితాబునిచ్చారు. 

గత మాసంలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై మండలిలో చర్చకు వైసీపీ పట్టుబట్టింది.ఈ బిల్లులపై చర్చకు టీడీపీ సభ్యులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఆర్ధిక బిల్లు మండలిలో పాస్ కాలేదు.