అమరావతి: త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున  బడ్జెట్‌లో కాపులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  వెయ్యి కోట్లను  కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది.

2014 ఎన్నికల ముందు కాపులకు ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని,రిజర్వేషన్లను కూడ ఇస్తామని కూడ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల మూడో వారంలో లేదా మార్చిలో ఎన్నికల షెడ్యూల్  విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ తరుణంలో మంగళవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో కాపులకు పెద్దపీట వేసింది. కాపు కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది.

ఇప్పటికే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను కూడ ఇస్తున్నట్టు కూడ ఏపీ సర్కార్ ప్రకటించింది.  ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరితో పాటు కొన్ని జిల్లాల్లో గెలుపు ఓటములపై కాపు సామాజికవర్గం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాపులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందేలా టీడీపీ సర్కార్ కార్పోరేషన్  ద్వారా వెయ్యి కోట్లను కేటాయించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే కాపులకు రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా బీసీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడ బీసీ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. టీడీపీకి బీసీ కులాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈ తరుణంలో బీసీ కులాలకు నష్టం వాటిల్లకుండా కాపులకు రిజర్వేషన్లను అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఇదే సమయంలో బీసీలకు కూడ తాయిలాలను ప్రకటించింది.

బీసీల్లోని అన్ని కులాలకు  కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది.  వెనుకబడిన తరగతులకు ఈ బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లను కేటాయించింది. అయితే బీసీల్లోని అన్ని కులాలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆయా కులాల జనాభా ఆధారంగా అందించనున్నారు. 

మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను కూడ తమ పార్టీలోకి చేర్చుకొనేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది.  ఇందులో భాగంగానే  వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాను టీడీపీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ బడ్జెట్ 2019: బీసీలు టార్గెట్, అన్ని కులాలకు కార్పోరేషన్లు

ఏపీ బడ్జెట్ 2019: రైతులకు అన్నదాత సుఖీభవ