అమరావతి: ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించింది.ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లను కేటాయించనున్నట్టు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. 

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.రైతాంగాన్ని ఆదుకొనేందుకు అన్నదాత సుఖీభవ అనే పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు యనమల రామకృష్ణుడు తన బడ్జెట్‌లో ప్రసంగంలో స్పష్టం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రూ.5 వేల కోట్లను కేటాయించినట్టు ఆయన ప్రకటించారు. 

పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని పెంచి రాయితీలను రూ.10 వేల నుండి రూ15 వేలకు పెంచినట్టుగా యనమల చెప్పారు.మొక్కజొన్నకు రూ.8 వేల నుండి రూ12 వేలకు, పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పంటలకు రూ. 6 వేల నుండి 10వేలకు పెంచినట్టు ఆయన తెలిపారు.

వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. సేంద్రీయ వ్యవసాయాన్నిప్రోత్సహించడం ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రశంసలను పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2014 ఎన్నికలకు ముందు రైతాంగానికి రుణ మాఫీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.అయితే ఈ హామీ మేరకు సుమారు 24 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మిగిలిన రెండు విడతల్లో  డబ్బులను కూడ త్వరలోనే చెల్లించనున్నట్టు కూడ  ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు.