Asianet News TeluguAsianet News Telugu

జూలై 1న ఏపీలో ఎంతమందికి పింఛను అందుతుందో తెలుసా..? తొలిసారి పింఛను తీసుకోకపోతే మళ్లీ ఇవ్వరా..?

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది జూలై 1వ తేదీన ఇంటింటికీ పింఛను పంపిణీ చేయనున్నారు. అయితే, ఒకటో తేదీ ఎంతమందికి పింఛను ఇస్తారో తెలుసా..? ఒకటో తేదీ పింఛను తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..?

Andhra Pradesh government all set for the distribution of pensions GVR
Author
First Published Jun 30, 2024, 2:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడవక ముందే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తొలుత మెగా డీఎస్సీ ప్రకటించింది. అలాగే, సామాజిక పింఛన్లు పెంచుతూ చేసిన ప్రకటన అమలు దిశగానూ చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఒకటో తేదీనే లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రణాళిక రూపొందించింది. 


జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ మొదలు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజే వందశాతం ఫించన్లు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పింఛన్లు పంపిణీలో నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఇతర విభాగాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 65 లక్షల 18వేల 496 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛను నగదు పంపిణీ చేపట్టింది. ఐదేళ్లలో విడతల వారీగా పింఛనును రూ.2000 నుంచి రూ.3000కు పెంచింది. అయితే, ఎన్నికల ముందు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచే పింఛను రూ.4వేలు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పింఛను రూ.3000 చొప్పున లబ్ధిదారులకు అందజేశారు. ఇక, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలల బకాయి రూ.1000 చొప్పున మొత్తం రూ.3000 కలిపి జూలైలో రూ.7వేల చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మొత్తం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. ఆ మొత్తాన్ని ఒకటో తేదీనే పంపిణీ చేసేందుకు ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా ఇప్పటికే సీఎస్ నీరబ్ కుమార్ ఆయా శాఖల అధికారులు, కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం మొదటిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం ఫించన్లు పంపిణీలో ఎక్కడా పొరపాట్లు, నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. జూలై 1వ తేదీన 100 శాతం ఫించన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకుని... మొదటి రోజే 95శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫించన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. 

మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సభ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత నిర్వహించే మొదటి కార్యక్రమం పింఛన్ల పంపిణీ. జూలై 1న నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408కోట్ల పింఛను నగదు పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ భాగస్వాములు కానున్నారు.

Andhra Pradesh government all set for the distribution of pensions GVR

 

అది జగన్ హయాంలో వేసిన డప్పు.. 

మరోవైపు, పింఛన్లపై అసత్య ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. లబ్ధిదారులు అనుకోని పరిస్థితిలో ఒక నెలలో పింఛను తీసుకోకపోయినా ఇలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ‘‘పేదలకు ఒకేసారి రూ.7వేలు పెన్షన్ ఇస్తుంటే, జగన్ రెడ్డి ఓర్వలేక తన ప్యాలెస్ బుద్ధి బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెబుతున్నా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. తన హయాంలో (2024 ఏప్రిల్ ముందు) పేదలను పీక్కుతింటూ, ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వేసిన డప్పుని, నేడు మళ్ళీ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు’’ టీడీపీ మండిపడింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios