టీటీడీ పాలకమండి సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. బోర్డు సభ్యులుగా రాజీనామా చేసిన రమేశ్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కె. రాఘవేంద్రరావు రాజీనామాలను ఆమోదించారు.

మరోవైపు టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు మరికొందరు సభ్యులు ససేమిరా అంటున్నారు. సభ్యులు రాజీనామ చేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక ఆర్దినెన్స్ దిశగా పావులు కదుపుతోంది.

8న జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో టీటీడీ బోర్డు రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీటీడీతో పాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల బోర్డును రద్దు చేసేలా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి.. దానిని గవర్నర్‌కు పంపనున్నారు. 

చట్టప్రకారం పాలకమండలి ఛైర్మన్‌ను లేదా సభ్యులను తొలగించాలంటే ముందుగా వారికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి. కానీ ఈ లోపే ఆ నోటీసులపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఇలా ప్రతి దేవాలయంలోని పాలకమండలికి.. వాటి సభ్యులకు నోటీసులు ఇవ్వడం సంక్లిష్టమైన ప్రక్రియ కాగా.. నోటీసులు అందుకున్న వారు కోర్టుకు వెళ్తే ప్రభుత్వం అనుకున్నది నెరవేరదు.. పైగా ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లిపోతుంది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో పాలకమండళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

ఏపీ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్స్ చట్టం-1987ను సవరించడం ద్వారా ఆర్డినెన్స్‌ను చలామణీలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఏదైనా ఆర్డినెన్స్ ప్రతిపాదనను గవర్నర్‌కు పంపాలంటే దానికి కేబినెట్ ఆమోదం తప్పనిసరి.

ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన జగన్ తానొక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ఒక్కరే ఉంటే దానిని కేబినెట్‌గా పరిగణించే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ చాలా రోజుల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు.

దీంతో అప్పట్లో ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ .. ఈ నెల 8వ తేదీన కేబినెట్ ప్రకటన.. మంత్రుల ప్రమాణం, ఆ వెంటనే తొలి మంత్రివర్గ సమావేశం ఉంటాయని సమాచారం. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే కేబినెట్ భేటీ జరిపి ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారని సమాచారం.