ఆంధ్రప్రదేశ్‌లోని గనుల శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామంటూ గనులశాఖ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ప్రోసీడింగ్స్ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని గనుల శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామంటూ గనులశాఖ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ప్రోసీడింగ్స్ ఇచ్చారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుతుంటే ఎస్మా ప్రోసీడింగ్స్ ఇవ్వడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాల చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనులో శాఖలో అత్యవసర సేవలు ఏముంటాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పీఆర్సీ వివాదాన్ని కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం పీఆర్సీ సాధన సమితితో మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వెల్లడించిన సంగతి తెలిసిదే. తాజాగా శనివారం కూడా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రుల కమిటీతో సమావేశమై చర్చించారు.

అనంతరం మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రలు కమిటీ సచివాలయంలో చర్చలు జరిపింది. ఈ బేటీ తర్వాత పీఆర్సీ సాధన సమితి నాయకులు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నట్టుగా తెలస్తోంది. అక్కడ సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల కీలక భేటీ జరిగే అవకాశం ఉంది. 

ఇక, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నట్టుగా మంత్రలు కమిటీ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు తమ సమస్యల సాధనలో పట్టువిడుపులకు తాము సిద్ధమని పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని .. ఈ అంశాలన్నీ ఒకదానితో మరొకటి లింక్ అయి ఉన్నాయని ఆయన చెప్పారు. కొన్నింటిలో ప్రభుత్వం, మరికొన్నింటిలో తాము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పీఆర్సీ పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాల్సిందేనని చెప్పారు. ఎక్కువ మంది ఉద్యోగులు సంతోషపడేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనే ఆశాభావంతో ఉన్నామని వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఈరోజు సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు.