ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ విజయవాడలో సమావేశం కానున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం గురువారంనాడు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను ఆ పార్టీ నాయకత్వం సేకరించనుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను కూడ తరుణ్ చుగ్ కు ఆ పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాలను చూస్తున్న తరుణ్ చుగ్ కు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కూడ ఆ పార్టీ అప్పగించింది.ఇవాళ తొలిసారిగా తరుణ్ చుగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది.నిన్న కూడ బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. జనసేన తమ మిత్రపక్షమని ఈ సమావేశం తీర్మానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కూటమిలో బీజేపీ కూడ కలుస్తుందనే ఆశాభావాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. జనసేన తమ మధ్య పొత్తుందని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలా, టీడీపీ, జనసేన కూటమితో కలవాలా అనే విషయమై ఇవాళ జరిగే సమావేశంలో బీజేపీ నేతలు తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలపనున్నారు.
తెలుగు దేశం, జనసేన కూటమితో కలిసి వెళ్లాలని కొందరు పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. మరికొందరు నేతలు ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారనే చర్చ కూడ పార్టీలో లేకపోలేదు. మెజారిటీ నేతలు ఈ కూటమితో కలిసి వెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఒంటరిగా పోటీ చేస్తే , కూటమితో వెళ్తే ఎలాంటి ప్రయోజనం అనే విషయాలపై ఇవాళ సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను తెలపనున్నారు.
సంక్రాంతి నాటికి పొత్తులపై బీజేపీ నాయకత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఇచ్చే స్పష్టత ఆధారంగా తెలుగు దేశం, జనసేన కూటమి తమ అభ్యర్థులను ప్రకటించనుంది. సంక్రాంతి తర్వాత తెలుగు దేశం, జనసేన అభ్యర్థుల ప్రకటన ఉండనుంది.
