విరాళాలను వెనక్కి ఇచ్చేస్తున్న జనసేన ... ఎన్నికల వేళ పవన్ ఎందుకిలా చేస్తున్నారు?
ఎన్నికల వేళ ప్రచారాన్ని హోరెత్తించాలంటే రాజకీయ పార్టీలకు డబ్బులు చాలా అవసరం. ఇలాంటి సమయంలో తమకు విరాళంగా వచ్చిన డబ్బులను కూడా నమ్ముకున్న నాయకుల కోసం వెనక్కి ఇచ్చేస్తుున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.
అమరావతి : రాజకీయ పార్టీలకు కార్పోరేట్ సంస్థలు, వ్యాపారులు విరాళాలు ఇస్తుంటారు. ఇలా జనసేన పార్టీకి కూడా కొందరు విరాళాలు ఇచ్చారు... కానీ అందుకు వాళ్ళు వెంటనే ప్రతిఫలం ఆశించారట. ఎన్నికల వేళ ఇలా విరాళాలు ఇచ్చినట్లే ఇచ్చి పలానా సీటు కావాలంటూ కోరుతున్నారట. ఇలా విరాళాల పేరిట సీట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నవారిపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు... టికెట్ అడిగేవారి చెక్కులను వెంటనే వెనక్కి పంపాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.
ఏనాడు ప్రజల మధ్యన లేకుండా ఇప్పుడు డబ్బులతో వచ్చి టికెట్ కావాలని అడిగిన ఆశావహులకు పవన్ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి ఆశావహులు ఇచ్చే విరాళాలను తీసుకోవద్దని పవన్ ఆదేశించారట. అలాగే ఇప్పటికే విరాళాలు ఇచ్చి సీట్లు కోరుతున్న వారి డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని పార్టీ వ్యవహారాలు చూసుకునేవారికి పవన్ ఆదేశించారు. దీంతో నిన్న(మంగళవారం) ఒక్కరోజే ఏడు చెక్కులకు జనసేన వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. ఇలాగే మరికొందరు సీటు ఆశిస్తున్న మరికొందరు ఇచ్చిన విరాళాలను కూడా వెనక్కి ఇచ్చేందుకు జనసేన పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు చాలా ఖర్చులు వుంటాయి... ఇలాంటి సమయంలో విరాళాలను వెనక్కి ఇవ్వాలన్న పవన్ నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. కానీ పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని డబ్బులతో రాజకీయాలు చేసేవారికి సీట్లు ఇవ్వడానికి పవన్ ఇష్టపడటం లేదు. అందువల్లే ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలకు డబ్బులు అవసరం వున్నా ఆశావహుల విరాళాలను తిరస్కరిస్తున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, సీటు ఆశించని ప్రముఖుల నుండి మాత్రమే విరాళాలు తీసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read Chandrababu: ఆ సీన్ రిపీట్ అవుతుందా? నేడు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కీలక భేటీ..
ఇదిలావుంటే టిడిపి-జనసేన కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకముందే మరో అంశం తెరపైకి వచ్చింది... అదే బిజెపితో పొత్తు. ఇప్పటికే జనసేన పార్టీ అటు టిడిపితో ఇటు బిజెపితో సన్నిహితంగా వుంటోంది. ఈ క్రమంలోనే ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. బిజెపి అదిష్టానం కూడా 2014 ఎన్నికల్లో మాదిరిగానే చంద్రబాబు, పవన్ తో కలిసి వెళ్లేందుకు సానుకూలంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ఇవాళ(మంగళవారం) టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా డిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు.
పొత్తుకు బిజెపి ఓకే అయితే మరోసారి సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన చంద్రబాబ, పవన్ మరోసారి బిజెపి నాయకులతో కలిసి భేటీ కానున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాగానే ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించనున్నారు.