వెనుకబడిన ప్రాంతాలకు మెండిచేయి చూపిన బడ్జెట్

విభజన కష్టాలతో సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ పై ఈసారి కూడా కేంద్రం కరుణించలేదు.నోట్ల రద్దు తో భారీగా నిధులు సమకూరాయని చెప్పిన ఆర్థిక మంత్రి ఆ మేరకు పేద, మధ్య తరగతి వారికి ఏ రాయితీలు ప్రకటించకలేదు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయం అందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్ లో ఎటువంటి అదనపు కేటాయింపులు చేయలేదు.

విభజన చట్టం లో పొందుపరచిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, కడప ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, సీమలో గార్మెంట్ హబ్ లాంటి వాటిలో దేనికీ నిధులు కేటాయింపు లేదు.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని 13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన పెద్ద మనుషుల పై ఏ చర్యలు లేవు. రైతులు తీసుకున్న రుణాలు 60 రోజుల్లో చెల్లిస్తేనే వడ్డీ రాయితీ అని చెప్పడం సంక్షోభంలో వున్న రైతాంగాన్ని మరింత సంక్షోభంలో నెడుతుంది. 

అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలు సంవత్సరం లోనే అత్యంత వెనుకబడిన తరగతులవారు 17 శాతం వుంటే కేవలం 2.5 శాతం (52 వేలకోట్లు) మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు.

సాగునీటి ప్రాజెక్టులకు కార్పస్ ఫండ్ పేరుతో 40 వేలకోట్లు ఒక్క పోలవరానికే సరిపోవు. 1 శాతం ధనికులవద్దే 58 సంపద పోగుబడిన మనదేశంలో ప్రత్యక్ష పన్నుల పెంచి పరోక్ష పన్నులు తగ్గించాలి. కానీ దీనికి విరుద్దంగా మళ్లీ ధనవంతులకు రాయితీల కల్పనకే మొగ్గు చూపారు.

ప్రణాళికా, ప్రణాళికేతర కేటాయింపులు కలిపి రంగాలవారిగా బడ్జెట్ కేటాయిస్తే భవిష్యత్తులో ఉద్యోగుల వేతనాలకూ గ్యారెంటీ వుండదు. వేతనాలకే బారీ ఖర్చుచేయాల్సి వస్తుందని దాడి మొదలవుతుంది. 

రెండు నెలల ముందుగానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో నిపుణుల నివేదికలన్నీ తుంగలో తొక్కి బడ్జెట్ లో విద్యా, వైద్య రంగాలకూ మెండిచేయి చూపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు లేవు. నిరుద్యోగ భృతి గురించి మాటమాత్రం మాట్లాడలేదే.

ఉపాధి హామీ పథకం పనులు కరువు ప్రాంతాలలోనైనా 150 రోజులకు పెంచుతారనుకుంటే 100 కే పరిమితం చేశారు. ఎప్పటిలాగ 48 వేల కోట్లు దీనికి కేటాయించినా వ్యవసాయానికి సంధానం చేస్తామనడంతో కూలీలకు దక్కేది అతంతే.


మొత్తంగా అంకెలు సంఖ్యలు ఎలా వున్నా, కేటాయించినవన్నీ ఖర్చు చేస్తారని చెప్పలేము. ఎందుకంటే గత బడ్జెట్ లో కేటాయింపులన్నీ ఆచరణలో ఖర్చు చేయలేదు. ఈసారి చేస్తారన్న గ్యారెంటీ లేదు.