కాంగ్రెస్ టికెట్ ఆశించినా కాసులు చెల్లించాల్సిందే... ఎంపీకైతే ఓ లెక్క, ఎమ్మెల్యేకైతే మరో లెక్క
కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న లోక్ సభతో పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సంసింద్దం అవుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ టికెట్ ఆశించేవారినుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఓవైపు రాష్ట్రవ్యాప్త పర్యటనతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కూడా చేపట్టారు కొత్త చీఫ్ షర్మిల. ఇందుకోసం తాజాగా పోటీకి ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తోంది ఏపీ కాంగ్రెస్. అయితే టికెట్ ఆశావహులు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు డబ్బులు కూడా చెల్లించాల్సి వుంటుంది. లోక్ సభ, అసెంబ్లీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు పార్టీ పండ్ గా ఎంత డబ్బు ఇవ్వాలో కూడా నిర్ణయించారు.
ఇవాళ(బుధవారం) ఏఐసిసి ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ దరఖాస్తు ఫారాల పంపిణీ ప్రారంభించారు. కాంగ్రెస్ సీరియర్ నేత కెవిపి రామచంద్రారావుతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఠాగూర్ ఇద్దరు ఎస్సి, ఓమైనారిటీ నేతకు అప్లికేషన్ ఫామ్స్ అందించారు. మడకశిర నుండి కె.సుధాకర్, బద్వేల్ నుండి కమలమ్మ, గుంటూరు తూర్పు నుండి మస్తాన్ వలీ టికెట్ ఆశిస్తున్నారు... వారికి మొదట అప్లికేషన్లు అందించారు. పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో వుంటాయని తెలిపారు. ఆశావహులు దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నిటినీ పొందుపర్చి నిర్ణీత సమయంలో తిరిగి అందివ్వాలని ఠాగూర్ సూచించారు.
దరఖాస్తులు స్వీకరించే సమయంలో పార్టీకి పండ్ గా కొంత సొమ్ము చెల్లించాల్సి వుంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. జనరస్ స్థానంలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రూ.25,000, రిజర్వుడ్ స్థానాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రూ.15,000 చెల్లించాలని నిర్ణయించారు. ఇక జనరల్ అసెంబ్లీ స్థానాలకు రూ.10,000, రిజర్వుడ్ స్థానాలకు రూ.5,000 డిపాజిట్ గా చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఇలా ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల దరఖాస్తుల సమయంలో అందే డిపాజిట్లను పార్టీ పండ్ గా ఉపయోగిస్తామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
Also Read Andhra Pradesh Election 2024 : వంగవీటి వర్సెస్ బోండా ... సోషల్ మీడియాకెక్కిన టిడిపి టికెట్ పంచాయితీ
ఈ దరఖాస్తుల పంపిణీ అనంతరం ఏఐసిసి ఇంచార్జీ ఠాగూరు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ను వీడిన నాయకులంతా తిరిగా చేరాలని కోరారు. ఇలా చేరే నాయకులతో పార్టీలో సముచిత స్థానం, రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీలో మాజీలకు సరైన గౌరవం దక్కుతుందని ఠాగూర్ అన్నారు.
నాయకులే కాదు కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించవచ్చని... వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను పోటీ చేయిస్తుందని అన్నారు. అశావహుల అప్లికేషన్లను సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందని మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇప్పుడు తిరిగి చేరేవారికి కూడా పోటీలో నిలిచే అవకాశాలు వుంటాయనేలా దరఖాస్తు ఫామ్ లో ఓ కాలమ్ ను పొందుపర్చారు. కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వీడారా? అవును అయితే తిరిగి పార్టీలోకి ఎప్పుడు చేరారు? అని అప్లికేషన్లలో పేర్కొన్నారు. అలాగే గత రెండు సంవత్సరాలు చేపట్టిన రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ దరఖాస్తు ఫామ్స్ లో పొందుపర్చాలి. వ్యక్తిగత వివరాలతో పాటు ఆశించే సీటు, గతంలో పోటీచేసివుంటే ఆ వివరాలు, పార్టీ పదవుల గురించిన వివరాలను కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ లో అభ్యర్థులు పేర్కొనాలి.