Andhra Pradesh Election 2024 : తెలంగాణ వ్యూహమే ఏపీలోనూ... షర్మిల ప్లాన్ మామూలుగా లేదుగా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అయ్యేందుకు ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఎన్నికల వేళ గ్యారంటీ హామీల ప్రకటన చేయాలని ఆమె భావిస్తున్నారట.

Andhra Pradesh Congress Chief YS Sharmila concentrate on Election Manifesto AKP

విజయవాడ : ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ పై కన్నేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పూర్వ వైభవంకోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు తెలుగురాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ ఇటీవల తెలంగాణలో సత్తాచాటింది. ఇదే ఊపుతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ దూకుడు పెంచింది. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిలనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి ఉనికిని చాటుకుంది. షర్మిల ఎంట్రీ ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది... తద్వారా ఆ పార్టీ పరిస్థితి మెళ్లిగా మారుతోంది. ఇలా పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న షర్మిల ఎన్నికలనాటికి ప్రజల్లోనూ కాంగ్రెస్ పై నమ్మకం పెంచేలా కార్యాచరణ రచిస్తున్నారు.  

ఇప్పటికే రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడుతున్న షర్మిల గతంలో పార్టీని వీడిన సీనియర్లను తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగినవారిని కలుస్తున్నారు. ఇలా ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు వైసిపి ప్రభుత్వం, తన సోదరుడు వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా ఎన్నికల వేళ షర్మిల చేస్తున్న రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజల్లో చర్చ మొదలయ్యింది. 

ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయ్యింది. ఇందుకోసం ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తాజాగా ఆంధ్రరత్న భవన్ లో సమావేశమై మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. అన్ని పార్టీలకంటే ముందుగానే మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట... అందుకు తగ్గట్లుగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది.

Also Read  జగన్ సిద్దమే అంటే... మేమూ సిద్దమే అంటున్న పవన్ : ప్లెక్సీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా..!  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దగ్గరినుండి చూసిన ఏపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అదే ఫార్ములాను ఏపీలోనూ వాడాలన్న భావనలో వున్నారట. తెలంగాణ కాంగ్రెస్ తరహాలోనే ఎన్నికలకు ముందే గ్యారంటీ హామీలను ప్రకటించాలని భావిస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలన్నది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. ఈ గ్యారంటీలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మేనిఫెస్టో కమిటీకి షర్మిల కోరినట్లు సమాచారం. ఆమె ఆదేశాల మేరకు త్వరలోనే గ్యారంటీలు, మేనిఫెస్టోను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు చాలా హామీలిచ్చింది కేంద్రం. వీటిని మేనిపెస్టోలో పొందుపర్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు పలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కమిటీ సూచించనుంది. అలాగే షర్మిల పర్యటనలో నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక, ప్రజా సంఘాలు కోరే అంశాల్లో కీలకమైన వాటిని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

ఇలా మేనిఫెస్టో కమిటీ నివేదికను రూపొందించి ఏపిసిసి అధ్యక్షురాలు షర్మిలకు అందించనుంది.  ఆమె ఏవయినా మార్పులు చేర్పులు వుంటే చేసి ఏఐసిసికి అందజేయనున్నారు. ఫైనల్ గా ఏఐసిసి ఈ నివేదికను పరిశీలించి అధికారికంగా మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియను ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తిచేసి రాహుల్ గాంధీ చేతులమీదుగా విడుదల చేయాలని భావిస్తున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేసిన రాహుల్ చేత గ్యారంటీ హామీలను కూడా ప్రకటించాలన్న ఆలోచనలలో ఏపీ కాంగ్రెస్ వున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios