తెలంగాాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుని మరీ కాంగ్రెస్ కు మద్దతిచ్చారు వైఎస్ షర్మిల. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ లో చేరి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ పార్టీకి వ్యతిరేకంగా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సొంత చెల్లి షర్మిల తలనొప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు... కానీ రచ్చ గెలిచినా ఇంటి పరిస్థితులను జగన్ చక్కదిద్దుకోలేకపోతున్నాడని అర్థమవుతోంది. తండ్రి ఆస్తుల విషయంలో చెల్లి షర్మిలతో జగన్ కు విబేధాలు తలెత్తాయని... ఇదికాస్త ముదిరి ప్రస్తుతం రాజకీయ వైరానికి దారితీసేలా వుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైస్సాఆర్ కుటుంబంలో రేగిన చిచ్చు ఇతర పార్టీలకు లాభంగా మారుతోందని... తద్వారా ఇద్దరూ నష్టపోయే ప్రమాదముందని వైఎస్ కుటుంబ సన్నిహితులు గ్రహించారట. దీంతో అన్నాచెల్లి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారు రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఇప్పటికే వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజీ కుదిర్చేందుకు వైఎస్ విజయమ్మ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల క్రిస్మస్ వేడుకల కోసం పులివెందుల వెళ్లిన విజయమ్మ కొడుకుతో షర్మిల విషయం మాట్లాడినట్లు వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఇతర పార్టీలవైపు షర్మిల వెళితే వైసిపికి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం వుందని గ్రహించిన జగన్ చెల్లితో సయోధ్యకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఇలా తల్లి విజయమ్మతో వైఎస్ కుటుంబ సన్నిహితులు కూడా జగన్ రాయబారులుగా షర్మిలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న షర్మిల ఆలోచనలో పడ్డారట. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవను మరిచి ఆయన మరణాంతరం కుటుంబాన్ని ఎంతలా ఇబ్బందిపెట్టారో వైఎస్ కుటుంబ సన్నిహితులు షర్మిలకు వివరించి మనసుమార్చే ప్రయత్నం చేస్తున్నారట. కాబట్టి అన్నతో వున్న విబేధాలను పరిష్కరించుకుని వైసిపి వైపే వుండాలని కోరుతున్నారట.
Also Read కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇటీవల ఏపీకి చెందిన కీలక నాయకులతో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు పార్టీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై చర్చ జరిగినట్లు... ఇందుకు కాంగ్రెస్ నేతలంతా సమ్మతం తెలిపారట. ఈ నేపథ్యంలో ఇక షర్మిలను పార్టీలో చేర్చుకుని ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుందట. త్వరలోనే అధినేత్రి సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల హస్తం కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.
మరోవైపు కడప జిల్లాలో వైఎస్సార్ కుటుంబసభ్యుల్లో ఒకరిని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోందట... అందులో భాగంగానే షర్మిలను పార్టీలో చేర్చుకుని కడప ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోందట. ఇదే జరిగితే కాంగ్రెస్ గెలవడం ఏమోగానీ వైసిపి కి మాత్రం తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇది టిడిపి-జనసేన కూటమికి ప్లస్ కానుంది. ఇదే విషయాన్ని షర్మిలకు వివరించి కాంగ్రెస్ లో చేరకుండా వైఎస్ కుటుంబ సన్నిహితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట.
ఒకవేళ అన్నకోసం ఆలోచించకుండా తన రాజకీయ భవిష్యత్ మాత్రమే ముఖ్యమని షర్మిల భావిస్తే మాత్రం కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ
షర్మిల అలా చేస్తారా? కూతురు కాంగ్రెస్ లో చేరడాన్ని విజయమ్మ అంగీకరిస్తుందా? అన్నది తేలాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ వైపుంటారా లేక అన్న వైఎస్ జగన్ కే మరోసారి మద్దతిస్తారా? అన్నది త్వరలో తేలనుంది.
