ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు (ఏప్రిల్ 19) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు (ఏప్రిల్ 19) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11:05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11:50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు చేరుకుంటారు.

అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం మనోహర్ లాల్ ఖట్టర్ విశాఖకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖ శారదా పీఠాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ సందర్శించారు. శారదపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఖట్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం పీఠంలోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్లారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఖట్టర్ పాల్గొన్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు.

స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖట్టర్‌ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మరోవైపు సింహాద్రి అప్పన్న స్వామిని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం దర్శించుకున్నారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకని పూజల్లో పాల్గొన్నారు. ఇక, ఈ నెల 20వ తేదీ వరకు మనోహర్ లాల్ ఖట్టర్ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లోనే బస చేయనున్నారు.