దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ముందు కూడా నడుస్తుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్సార్ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం మొదలైన ఈ పర్యటన శనివారంతో ముగుస్తుంది. గురువారం తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా జిల్లాలో పూర్తయిన పలు అభివృద్ధి పనులను జగన్ ప్రారంభించనున్నారు. ఇడుపుల పాయలో వైఎస్సర్ వర్థంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం పాల్గొంటారు. తిరిగి సెప్టెంబర్ 3న విజయవాడకు ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు.
