సెప్టెంబర్ 3 న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం: విభజన అంశాలను ప్రస్తావించాలన్న సీఎం జగన్
సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర విభజన జరిగి ‘ ఏళ్లు దాటినా కూడా ఇంకా కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా జగన్ గుర్తు చేశారు.
అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన కేరళ రాస్ట్రంలోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీన ఉన్నందున ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశాలకు హాజరు కానుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్రం తరపున 19 అంశాలను అజెండాలో ఉంచినట్టుగా అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
విభజన సమస్యలను జోనల్ కమిటీ సమావేశంలో ప్రస్తావించాలని సీఎం జగన్ కోరారు. వీటి పరిష్కారం కోసం అధికారులు సమావేశంలో కేంద్రీకరించాలని సీఎం సూచించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరాలని సీఎం చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసే వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాల్సిన అవసరం ఉండాలని అధికారులు డిమాండ్ చేయాలన్నారు.
రాష్ట్ర విభజనతో ఏపీ రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. విభజన సమస్యలు పరిష్కారించడంలో ఆలస్యమయ్యే కొద్దీ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేయాలని ఈ సమావేశంలోడిమాండ్ చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.