పోలవరంపై అంబటి మాటలు ... పగలబడి నవ్విన సీఎం చంద్రబాబు 

గత ఐదేళ్ల వైసిపి పాలనలో పోలవరం ప్రాజెక్ట్ ఎంతలా విధ్వంసమయ్యిందో వివరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.ఇలాంటి సీరియస్ సమావేశంలోనూ నవ్వులు పూయించింది  మాజీ మంత్రి అంబటి రాంబాబు వీడియో.

Andhra Pradesh CM Nara Chandrababu Naidu Laughs on Ambati Rambabu comments on Polavaram AKP

Polavaram Project : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే నారా చంద్రబాబు నాయుడు ఓ రెండు ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. అందులో ఒకటి తన కలల ప్రాజెక్ట్ రాజధాని అమరావతి, ఇంకోటి ఆంధ్రుల చిరకాల ప్రాజెక్ట్ పోలవరం. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు రంగంలోకి దిగారు... పనులను జెట్ స్పీడ్ తో ముందుకు నడిపించే చర్యలు ప్రారంభించారు. అయితే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ సర్కార్ ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టులను విధ్వంసం చేసిందో తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేసారు. 

అయితే పోలవరం నిర్మాణంలో వైఎస్ జగన్ అజ్ఞానం, వైసిపి ప్రభుత్వ వైఫల్యం గురించి చంద్రబాబు సీరియస్ గా వివరించారు. ఈ  క్రమంలో ఓ వీడియో సీరియస్ గా సాగుతున్న మీటింగ్ లో నవ్వులు పూయించాయి. పోలవరం గురించి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్న వీడియోను చంద్రబాబు ప్లే చేసారు.ఈ సందర్భంగా ఆయన మాటలు విని సీరియస్ గా ప్రజెంటేషన్ ఇస్తున్న చంద్రబాబు పగలబడి నవ్వారు. 

అంబటి రాంబాబు ఏం మాట్లాడాడంటే : 

గత వైసిపి ప్రభుత్వంలో అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసారు. ఈ సమయంలోనే ఆయన చాలాసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు... అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. కానీ ఎంత తెలుసుకున్నా పోలవరం ప్రాజెక్ట్ తనకు అర్థమే కాలేదని... దాన్ని అర్థంచేసుకోవడం అంత ఈజీ కాదని రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో చాలా కాంప్లికేట్ విషయాలున్నాయని... ఇప్పటికీ అవి తనకు అర్థం కాలేవంటూ స్వయంగా ఆనాటి నీటిపారుదల మంత్రి అంబటి మాట్లాడటంతో చంద్రబాబు నవ్వుకున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు ఎంతో స్టడీ చేసి, ఎందరో నిపుణులతో మాట్లాడాక ఇది ఇప్పుడు పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదని అర్థమైందని అంబటి అన్నారు. ఇలా మాజీ నీటిపారుదల మంత్రి మాట్లాడిన వీడియో ప్లే చేసి వీళ్లకు పోలవరం అంటే నవ్వులాట అయ్యిందంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు వీడియో ప్లే అవుతున్నంతసేపు చంద్రబాబుతో పాటు శ్వేతపత్రం విడుదల కార్యాక్రమంలో పాల్గొన్నవారంతా నవ్వుకున్నారు. 

 

పోలవరంపై వైఎస్ జగన్ ఏ ఏడాది ఏమన్నారో వీడియో: 

వైసిపి అధికారం చేపట్టాక ఆనాటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం గురించి ఎప్పుడేం మాట్లాడారో వీడియోతో సహా బయటపెట్టారు తాజా సీఎం చంద్రబాబు. ఇలా పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ పూటకో మాట మాట్లాడారని చంద్రబాబు ప్రజలకు తెలియజేసారు. అధికారంలోకి రాగానే 2021 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ఆ తర్వాత రెండోసారి 2021 డిసెంబర్ నాటికి... మూడోసారి 2022 ఏప్రిల్ నాటికి... నాలుగోసారి 2023 ఖరీఫ్ నాటికి... ఇటీవల 2025 నాటికి పూర్తి చేస్తామని జగన్ చెప్పుకుంటూ వెళ్లిన వీడియోలను చంద్రబాబు ప్లే చేసారు. 

గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించి పోలవరం ప్రాజెక్టు దుస్థితిపై అధ్యయనం చేయాల్సి వస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. హైడల్ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పూర్తికాలేదు... దీంతో ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం డ్యామేజ్, రిపేరు పనులకు రూ.4,900 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.    పిచ్చి కుక్క ముద్ర వేసి కుక్కను చంపినట్లు...పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేసేందుకు గతంలో టిడిపి ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందనే తప్పుడు ప్రచారం చేసారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios