ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వర్చువల్‌గా సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఇక, రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కి పెరిగింది. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు 72కు పెరిగాయి. నేటి నుంచి కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీల, ఇతర అధికారులను నియమించింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు మంచి పనికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు అని అభివర్ణించారు. నేడు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల రాష్ట్రంగా రూపు మారిందన్నారు. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలానే ఉన్నాయని అన్నారు. 

గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడామని తెలిపారు. 1970 మార్చిలో ప్రకాశం, 1979 జూన్‌లో విజయనగర జిల్లాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో ఏర్పడిన కొత్త జిల్లాలు అని చెప్పారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ రోజు కలెక్టర్ల పాత్ర కీలకంగా మారిందని చెప్పారు.

‘ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 4.96 కోట్ల మంది జనాభాలో సగటున జిల్లాకు 38.15 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకు సగటున 19.07 లక్షల మంది జనాభా ఉంది. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు మార్పులు అవసరం. గ్రామస్థాయి నుంచి మార్పు తీసుకురావాల్సిన అవరసరం ఉంది. గడిచిన మూడేళ్లుగా పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష లేకుండా పాలన జరుగుతోంది’ అని సీఎం జగన్ చెప్పారు. 

కుప్పంపై జగన్ కీలక వ్యాఖ్యలు 
స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తితో పాటు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోగా.. ఇప్పుడు ఆయనే అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. 

ఇక, ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీచేసింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. ఈ ప్రకారం.. 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ.. విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. వాటిపై సమీక్షించిన ప్రభుత్వం.. స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.

ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా పేరు మార్చింది. మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు. మొత్తం 72 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు.