మోఢీతో బాబు 'ఢీ':నీతి ఆయోగ్ మీటింగ్‌లో రాష్ట్రాల వాదనలు, బిజెపియేతర సీఎంలతో చర్చలు


అమరావతి: నీతి అయోగ్ సమావేశంలో రాష్ట్రాల వాదనలను కూడ విన్పించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.తమ వాదనలను కేంద్రం పెడచెవిన పెడితే  సమావేశాన్ని బహిష్కరించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బిజెపియేతర సీఎంలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు. మరో వైపు ఆందోళన చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించనున్నారు.

నీతి ఆయోగ్ సమావేశం ఆదివారం నాడు ప్రధానమంత్రి అద్యక్షతన న్యూఢిల్లీలో జరగనుంది.ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి చెందిన పలు అంశాలను బాబు ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై బాబు ప్రస్తావించనున్నారు. ఈ మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులతో బాబు రెండు రోజులుగా కసరత్తు చేశారు.

రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఇంకా రావాల్సిన నిధులు ఎన్నికల సమయంలో ఇచ్చిన  హమీలను కూడ ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు.నీతి అయోగ్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపియేతర రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. ఎజెండా అంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను కూడ ప్రస్తావించాలని భావిస్తున్నారు. కేంద్రం తీసుకొంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు కలుగుతున్న ఇబ్బందులను కూడ ప్రస్తావించాలని భావిస్తున్నారు.

మరోవైపు ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హమీతో పాటు విభజన సమస్యలను కూడ బాబు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. బిజెపియేతర రాష్ట్రాల సీఎంలు ఈ విషయమై చర్చించారు. అయితే అవసరమైతే సమావేశాన్ని బహిష్కరించే యోచనలో కూడ ఉన్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా  చంద్రబాబునాయుడు మద్దతును ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ తో ఫోన్లో బాబు చర్చించారు.  

ఢిల్లీ పర్యటనలో బిజెపియేతర సీఎంలతో పాటు బిజెపియేతర పార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలోనే ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబునాయుడు నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి కానుంది.

నీతి ఆయోగ్ సమావేశం కోసం సీఎం చంద్రబాబునాయుడు 24 పేజీల సమగ్ర నివేదిక సిద్ధం సీఎం చేసుకున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని సీఎం నిర్ణయం తీసుకన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు ఆయన పట్టుబట్టనున్నారు. మాట్లాడే అవకాశమివ్వకుంటే అక్కడే నిరసన తెలిపే యోచనలో సీఎం ఉన్నారని సమాచారం.