ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) స్వాభిమాన్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ 1091ను ప్రారంభించింది. 

ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) స్వాభిమాన్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ 1091ను ప్రారంభించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో దీనిని ప్రారంభించారు. ప్రత్యేకంగా కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్.. ట్రాన్స్‌జెండర్ల మానసిక, ఇతర సమస్యలను పరిష్కరించడంతో పాటుగా భద్రతను పెంపొందించడానికి, హక్కులను రక్షించేందుకు ఉద్దేశించబడింది. ఈ హెల్ప్‌లైన్‌ను ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్ సంజయ్ ప్రతిపాదించారు. 

దీనిని హింసను అంతం చేయడం ద్వారా లింగమార్పిడి వ్యక్తుల భద్రత, గౌరవాన్ని కాపాడటం, దుర్వినియోగం, శారీరక హింసతో సహా వారిపై వివక్షను నిరోధించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారిపై నేరాల కేసులను పర్యవేక్షించడం, చట్టపరమైన తీసుకోవడం కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నోడల్‌ అధికారిణిగా సీఐడీ మహిళా రక్షణ విభాగం ఎస్పీ కేజీవీ సరిత నియమితులయ్యారు.

లింగమార్పిడి వ్యక్తుల (రక్షణ నియమాలు) చట్టం-2019, లింగమార్పిడి వ్యక్తుల (రక్షణ నియమాలు)-2020 ప్రకారం ఈ హెల్ప్‌లైన్ పని చేస్తుందని సరిత తెలిపారు. దీని ద్వారా ట్రాన్స్‌జెండర్ల ఫిర్యాదులను విశ్లేషించి, కౌన్సెలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది టోల్ ఫ్రీ నంబర్ అని.. ఎలాంటి ఛార్జీలు ఉండవని ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారిని ఎగతాళి చేయడం, అవమానించడం, వారి వైకల్యాన్ని శాపంగా చేసుకుని రాజకీయ పరంగా ఇతరులను దూషించడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని, అందుకే ఈ హెల్ప్‌లైన్ పేరును ‘స్వాభిమాన్’గా మార్చామని ఆమె పేర్కొన్నారు.

‘‘వారు మోసం చేయబడతారు, శారీరకంగా, మానసికంగా దాడి చేయబడతారు. వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హెల్ప్‌లైన్ సమాజంలో వారు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. అవసరమైతే ఏపీసీఐడీ విభాగం కౌన్సెలింగ్‌ను కూడా అందిస్తుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారి ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.