ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు: ఫిబ్రవరిలో షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణీతక షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రులకు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పారు.
శుక్రవారంనాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు. మార్చి, ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు.
ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం వై.ఎస్. జగన్ మంత్రులకు చెప్పారు.నిర్ణీత సమయానికంటే 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం వై.ఎస్.జగన్ మంత్రులకు వివరించారు. ఈ ఎన్నికల సమయంలో మంత్రులు మరింత కష్టపడి పనిచేయాలని సీఎం జగన్ సూచించారు.
2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే 2024లో 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వై.ఎస్. జగన్ తెలిపారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంత్రులు ఆయా జిల్లాల్లో పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి కూడ సీఎం జగన్ ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడ 15 రోజుల ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ కోతలుంటే ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ గుర్తు చేశారు. ఈ కారణంగానే పార్లమెంట్ కు కూడ ముందుగానే ఎన్నికలకు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని జగన్ చెప్పారు. ఈ కారణంగానే మార్చి నెలలో రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుతో వెళ్లనున్నాయి. ఒంటరిపోరు చేస్తామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.