బిసి కులగణన, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు.... జగన్ కేబినెట్ భేటీలో ఇంకెన్నో నిర్ణయాలు
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో ప్రజలపై వరాలు కురిపించే నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యింది. రాష్ట్ర సచివాలయంలో మొత్తం 38 అంశాలు ఎజెండాగా ఈ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఉదయమే ఈ భేటీ మొదలవగా ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో బిసి కులగణన చేపడతామని ప్రకటించిన నేపథ్యంతో దీనిపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ నెల 15 నుండే ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక జర్నలిస్టులు ఇళ్ల స్థలాల హామీని కూడా నెరవేర్చేందుకు కూడా జగన్ సర్కార్ సిద్దమయ్యారు. ఈ కేబినెట్ లో దీనిపై చర్చించి ఇళ్లస్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపే అవకాశం వుంది.
ఇక ఇదే కేబినెట్ భేటీలో SIPB (State Investment Promotion board) రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయ పరిమితి ఆధారంగా నిర్ణయించే కేటగిరీల్లో మార్పులపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని మంత్రిమండలి ఆమోదించనుంది.
Read More జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం: సీబీఐకి సుప్రీం నోటీసులు
ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2022 జులై నుండి పెండింగ్ లో వున్న డిఏ ను మంజూరు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది.
ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు సాకేత్ మైనేనికి ప్రోత్సాహకంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించి అతడికి ప్రకటించిన ప్రోత్సాహకాలకు ఆమోదం తెలపనున్నారు. ఇలా ఇంకా చాలా అంశాలను ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు.