అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల కోసం ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.సోమవారం నాడు జరిగిన కేబినెట్‌లో ఈ దిశగా  ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకొంది. 

సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. చేనేత కార్మికులకు ఆరోగ్య భీమాను కల్పించాలని  ఈ కేబినెట్‌లో నిర్ణయం తీసుకొంది.  ట్రాక్టర్, ఆటోలకు జీవితకాలం పన్నును మినహాయిస్తూ కేబినెట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2014 నుండి అనుమతి లేకుండా  ఇల్లు నిర్మించుకొన్న పేదలకు రూ.60వేలు చొప్పున  చెల్లించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రూ.756 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో తాగునీటి కోసం రూ.2607కోట్లకు  కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేపిటల్ హౌజింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలి సీఆర్ డీఏను  కేబినెట్ ఆదేశించింది. సీఆర్ డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపర్చాలని సర్కార్  కోరింది. 

రాజధానిలో పనిచేస్తున్న ఉద్యోగులు, జర్నలిస్ట్‌లకు ఇళ్ల నిర్మాణం కోసం 25 ఎకరాల భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ ప్రోత్సాహకాలను కొనసాగించాలని  కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ చెల్లింపుకు కేబినెట్ ఓకే చెప్పింది.డ్వాక్రా సంఘాల మహిళలకు సెల్‌ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఒక్కొక్క డ్వాక్రా సంఘంలోని సభ్యురాలికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.